: సైనిక నియామకాల కోసం కజకిస్థాన్ ‘మిస్ ఆర్మీ’ పోటీలు!
సైనిక నియామకాల వైపు యువతను ఆకర్షించేందుకు కజకిస్థాన్ సరికొత్త విధానాన్ని అవలంబిస్తోంది. సైనిక నియామకాల పట్ల యువతలో నానాటికి తగ్గుతున్న ఆసక్తిని పెంపొందించేందుకు ఆ దేశ రక్షణ శాఖ ఏకంగా అందాల పోటీనే నిర్వహిస్తోంది. మహిళా సైనికులతో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆ దేశ యువతను సైన్యం దిశగా మళ్లించాయట. వివరాల్లోకెళితే... కజకిస్థాన్ లో సైన్యంలో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీనిని నివారించేందుకు ఆ దేశ రక్షణ శాఖ పలు మార్గాలను అన్వేషించి, చివరకు మహిళా సైనికుల అందాల పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. 123 మంది అందమైన మహిళా సైనికుల ఫొటోలను నెట్ లో పెట్టి, 'వీరిలో అందగత్తెను ఎంచుకోండి' అంటూ జనాలకు పిలుపునిచ్చింది. ఈ పోటీలకు జనం నుంచి స్పందన బాగానే వచ్చింది. అదే సమయంలో ఇంతటి సుందరాంగులే దేశానికి సేవ చేస్తుంటే, తామేమైనా తీసిపోయామా? అంటూ యువత పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరేందుకు బారులు తీరుతున్నారట. ఇక అందాల పోటీలో అయ్ గెరెమ్ కరకుచోవా అనే సైనికురాలు 1,100 ఓట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోందట.