: కేసీఆర్ ‘సీతా పరిణయం’ ప్రశ్నకు విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులూ ఆన్సర్ చెప్పలేదట!


సీతా పరిణయంలో శివ ధనుస్సును విరిచిందెవరు?... ఇదీ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓ సర్కారీ పాఠశాలలో వేసిన ప్రశ్న. ఈ ప్రశ్నకు విద్యార్థుల నుంచే కాదండోయ్, ఉపాధ్యాయుల నుంచి కూడా సమాధానం రాలేదట. నిజమేనండి బాబూ, ఈ విషయాన్ని సాక్షాత్తు కేసీఆరే చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో భాగంగా నిన్న కేసీఆరే ఈ విషయాన్ని చెప్పి, సదస్సులో నవ్వులు పూయించారు. సర్కారీ పాఠశాలల పనితీరును మెరుగుపరచాలని కేసీఆర్ నిన్న కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ప్రస్తావించారు. ‘‘సర్కారీ స్కూళ్లలో చదువులెలా సాగుతున్నాయో చూద్దామని ఓసారి అధికారులతో కలిసి ఓ మారుమూల పాఠశాలకు వెళ్లాను. అరగంట గడిచినా ఇద్దరే టీచర్లు వచ్చారు. ఇదేంటయ్యా, టైము దాటినా ఇద్దరే టీచర్లు వచ్చారని ఓ వ్యక్తిని అడిగితే, ‘బస్సులే లేకపోతే టీచర్లెలా వస్తారండి?’ అంటూ ఆ వ్యక్తి ఎదురు ప్రశ్నించాడు. క్లాస్ లో పాఠాల బోధనను పరిశీలిద్దామని వెళ్లి, సీతా పరిణయంలో శివ ధనుస్సు విరిచిందెవరని ప్రశ్నించా. పదిరోజులకు ఓ సారి పాఠశాలకు వచ్చే తనకెలా తెలుస్తుందంటూ ఓ విద్యార్థి చెబితే... మా నాయన మండల ప్రెసిడెంట్, నేను స్కూలుకే రానంటూ మరో విద్యార్థి చెప్పాడు. ఇక ఉపాధ్యాయులైనా చెబుతారనుకుంటే, ఓ టీచర్ తనకు తెలియదని ముఖం మీదే చెప్పేశాడు. ప్రధానోపాధ్యాయుడికి ఇదే ప్రశ్నను సంధిస్తే, ‘మా పిల్లలంతా బుద్ధిమంతులు సార్.. వారెవరూ ధనుస్సు విరవలేదు. ఊర్లో ఎవడో ఆకతాయి విరిచి ఉంటాడు’ అంటూ విచిత్రంగా స్పందించాడు’’ అని కేసీఆర్ చెప్పడంతో సదస్సులో నవ్వులు విరిశాయి.

  • Loading...

More Telugu News