: నిర్మాతల మండలిని కబ్జా చేయాలన్నదే వారి ఆలోచన: దగ్గుబాటి సురేష్‌ బాబుపై నట్టికుమార్‌ సంచలన వ్యాఖ్యలు


1400 మంది సభ్యులున్న నిర్మాతల మండలిని కేవలం 14 మంది నడిపించాలని చూస్తున్నారని, ముఖ్యంగా, నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు నియంతలా వ్యవహరిస్తున్నారని సినీ నిర్మాత నట్టికుమార్‌ సంచలన విమర్శలు చేశారు. ఏపీలో థియేటర్లన్నీ తన చేతుల్లోనే ఉన్నట్లుగా శాసిస్తున్నారని మండిపడ్డారు. చిన్న నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారని, తమ హక్కులకు భంగం కలిగిస్తున్న ఆ 14 మంది నిర్మాతలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్మాతల మండలిలో రూ. 16 కోట్లు ఉండగా, రూ. 5 కోట్లు కాజేశారని, మిగిలిన డబ్బును కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దాసరి నారాయణరావు చిన్న నిర్మాతలకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. రూ. 16 కోట్ల మండలిని చిన్న నిర్మాతలకు అప్పగిస్తే 6 నెలల్లో దాన్ని రూ. 32 కోట్లు చేసి చూపిస్తామని అన్నారు. పరిశ్రమను శాసిస్తున్న ఆ 14 మంది నిర్మాతలపై మిగతా వారు త్వరలోనే తిరగబడతారని నట్టికుమార్‌ అన్నారు. తన ఆరోపణలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News