: పేర్లు మార్చుకోండి... ఆన్ లైన్ కుంభకోణాలు చేయండి... సాధ్యమైనంత ఎక్కువమందిని చంపండి: బయటపడ్డ ఐఎస్ఐఎస్ ఉగ్ర కార్యాచరణ పత్రాలు
దాడులకు ఎలా సిద్ధం కావాలి? నిధుల సమీకరణ ఎలా? వంటి పలు విషయాలను చర్చిస్తూ, భవిష్యత్ కార్యాచరణను ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తయారుచేసుకోగా, సుమారు 70 పేజీలున్న ఈ మాన్యువల్ ఆన్ లైన్ లో బహిర్గతమైంది. ప్రతిచోటా ఒకరిద్దరు స్లీపర్ సెల్స్ ను తయారు చేయాలన్నది వీరి ప్రధాన ఉద్దేశం. ఇంగ్లీష్ లో మంచి పట్టున్న వారు తయారుచేసినట్టుగా ఉన్న ఈ మాన్యువల్ లో, ఐఎస్ఐఎస్ యోధులు తమ పేర్లను మార్చుకోవాలని, అవి పశ్చిమ దేశాల పేర్ల మాదిరిగా ఉండాలని తెలిపింది. నిధుల సమీకరణ కోసం ఆన్ లైన్ లో కుంభకోణాలు, మోసాలు చేయాలని ఆదేశించింది. దీనిలో పెట్రోలు బాంబుల తయారీ, ఇంట్లోనే మొబైల్ ఫోన్లు పేలేలా ఎలా చేయాలి? వంటి వివరాలు ఉన్నాయి. దాడులు చేసేటప్పుడు, బయట తిరిగేటప్పుడు కళ్లకు కాంటాక్ట్ లెన్సులు ధరించడం ద్వారా చూపరులకు అయోమయం కలిగేలా చూడాలని తెలిపింది. పశ్చిమదేశాల నుంచి ఐఎస్ఐఎస్ లో చేరే సానుభూతిపరులు వారి ప్రాంతాల్లోని ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకోవాలని, అందుకు సహకరిస్తామని పేర్కొంది. ప్రభుత్వాధికారులు తమ ప్రభుత్వాలపట్ల నిరాశగా ఉంటే, వారిని లోబరచుకోవాలని తెలిపింది. ఒట్టి చేతులతో కుక్కర్ బాంబులు, మైక్రోవేవ్ ఓవెన్ లతో బాంబులు, తనంతట తానుగా పేలిపోయే కార్లు తదితరాల తయారీని వివరించింది. అవకాశం వస్తే సాధ్యమైనంత ఎక్కువ మందిని హతమార్చాలని సూచించింది. ఈ మాన్యువల్ ఎక్కడెక్కడ అప్ లోడ్ అయింది? అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.