: అజ్మీర్ దర్గాకు అమెరికా అధ్యక్షుడి కానుక
అజ్మీర్ లోని ప్రఖ్యాత హజ్రత్ ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎరుపు రంగు చాదర్ ను కానుకగా పంపారు. రేపటి నుంచి 803వ ఉర్సు ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా చాదర్ తయారు చేయించి అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ద్వారా దర్గా అధిపతులకు అందజేయించారు. దాంతో పాటు ప్రపంచమంతా శాంతి, సామరస్యాలతో వెల్లివిరియాలన్న సందేశాన్ని కూడా ఒబామా పంపినట్టు ఖ్వాజా సాహెబ్ నషీన్, చిస్తీ ఫౌండేషన్ డైరెక్టర్ సయిీద్ సల్మాన్ మీడియాకు తెలిపారు. దర్గాకు ఓ దక్షిణాసియాయేతర దేశం చాదర్ పంపడం ఇదే తొలిసారని చెప్పారు. సూఫీ తత్వాన్ని పాశ్చాత్యదేశాలు కూడా గౌరవించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.