: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలి: కేసీఆర్
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. తెలుగును విస్మరించకుండానే ఇంగ్లీష్ బోధన జరగాలని తెలిపారు. ఎలాంటి అంతరాలు లేకుండా విద్యార్థులంతా ఒకే చోట విద్య నేర్చుకోవాలన్నారు. మారియట్ హోటల్లో రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని, వచ్చే ఏడాది ప్రతి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివేలా విద్యా వ్యవస్థను తయారు చేయాలని పేర్కొన్నారు. విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజన బిల్లులు నెలనెలా చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యావిధానం కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు.