: యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లకు ఆప్ షోకాజ్ నోటీసులు
పార్టీ రెబల్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లకు ఆమ్ ఆద్మీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గానూ ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆప్ పేర్కొంది. పార్టీపై వారు చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. ఆ తరువాత వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించనున్నట్టు తెలుస్తోంది. యాదవ్, భూషణ్ లతో పాటు ఆనంద్ కుమార్, అజిత్ ఝాలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్ పాయ్ తెలిపారు. నోటీసులపై యాదవ్ స్పందిస్తూ, ఈ చర్య సహజ న్యాయ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణా కమిటీ నుంచి అర్ధరాత్రి నోటీసులు అందాయని ట్విట్టర్ లో తెలిపారు. అయితే నోటీసులు తనకు అందకముందే కొందరు అందులోని విషయాన్ని లీక్ చేయడం చాలా తమాషాగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే యాదవ్, భూషణ్ లను పార్టీలోని పలు కీలక పదవుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.