: రైతులతో రాహుల్...కొత్త ఉత్సాహంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ యువరాజు పునరాగమనం ఆ పార్టీలో పునరుత్తేజం నింపుతోంది. నిన్నటి వరకు విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ పార్టీ, ఎన్డీయే ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ నెల 19న భూసేకరణ బిల్లుపై నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నేడు రాహుల్ గాంధీ రైతులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ, తాము రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. యువతరం యుగం నడుస్తోందని, సీనియర్లు రిటైరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.