: హతమైన సిమీ ఉగ్రవాదులు ఏపీ మొత్తం తిరిగేశారు... వెలుగులోకి వస్తున్న కీలకాంశాలు


నల్గొండ జిల్లా జానకీపురంలో ఎన్ కౌంటరైన ఇద్దరు ఉగ్రవాదులపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న వీరు, తీవ్రవాదం ఆనవాళ్లు లేని, ఆంధ్రప్రదేశ్ లో మకాం వేశారట. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్టణాల్లో కొన్నాళ్ళు గడిపారు. వీరి ఆనుపానులపై గుట్టుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, ఆంధ్రా పోలీస్ పలు కీలక ఆధారాలు సేకరించారు. వీరు ఏఏ ప్రాంతాల్లో తిరిగారు? ఎవరెవర్ని కలిశారు? ఎక్కడెక్కడున్నారు? వంటి విషయాలను తెలుసుకున్నారు. వీరికి సిమీ స్లీపర్ సెల్స్ ఎవరైనా సహాయసహకారాలు అందించారా? అనే వివరాలు సేకరించారు. ఆయా పట్టణాల్లో వీరు కలిసిన, వీరికి ఆశ్రయమిచ్చిన పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీరు కొన్ని కన్సల్టెన్సీలను కూడా కలిసినట్టు తెలుస్తోంది. తమకు ఉద్యోగం ఇవ్వాలని, తమవారు మరి కొందరు వస్తారని, వారికి కూడా ఉద్యోగం ఇవ్వాలని కోరినట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వీరు ఆయా పట్టణాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు? అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంటి ఓనర్లను, వారిని కలిసేందుకు వచ్చిన వారి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అందుకే అద్దెకు ఇల్లు ఇచ్చే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు యజమానులకు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News