: అంత సులువేం కాదు... కానీ నెంబర్ వన్ గా ఎక్కువకాలం ఉండాలని ఆశిస్తున్నా: సైనా
బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి చేరుకున్న క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 'దీనిని నిలబెట్టుకోవడం అంత సులువేం కాదంటోంది'. నెంబర్ వన్ స్థానంలో ఎక్కువకాలం ఉంటానని నమ్ముతున్నానని, దానికోసం మరింత కృషి చేస్తానని తెలిపింది. పీటీఐ ఇంటర్వ్యూలో సైనా మాట్లాడుతూ, "నెంబర్ వన్ ర్యాంకును మెయింటెన్ చేయడం చాలా కష్టం. కానీ ఈ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్న మొదటి వ్యక్తినన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి" అని చెప్పుకొచ్చింది. "అన్నీ సవ్యంగా ఉంటే, నేను బాగా శిక్షణ తీసుకుంటే తప్పకుండా నెంబర్ వన్ ర్యాంకును సుదీర్ఘకాలం మెయింటెన్ చేయగలను. కానీ, నేను చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే, దీనిని కాపాడుకోవడం అంత సులభం కాదు. నేను ప్రపంచ నెంబర్ వన్ అని, అలానే కష్టపడాలని నా మైండ్ లో ప్రతిరోజు అనుకోవాలి. ఇకముందు నా దేశం కోసం చాలా టైటిళ్లు గెలిచేందుకు నా వంతు శ్రమిస్తా" అని సైనా చెప్పుకొచ్చింది.