: అంచనాలు అందుకోని ఎయిర్ ఇండియా పనితీరు
నిర్వహణ నష్టాలను తగ్గించుకోవాలని అవస్థలు పడుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పనితీరు మెరుగుపడక పోగా మరింత దిగజారింది. 2014-15లో ఏఐ నిర్వహణా నష్టం రూ. 2,171 కోట్ల వద్ద నిలిచింది. తొలుత నిర్దేశించుకున్న నిర్వహణా నష్టాల అంచనా రూ. 1200 కోట్ల కంటే ఇది రూ. 971 కోట్లు అధికం. ఆదాయం తగ్గడం, ఉద్యోగుల నిరసనలు, పలురూట్లలో పెరిగిన ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థల పోటీ తదితరాల వల్ల సంస్థ ఆదాయాలు తగ్గాయని తెలుస్తోంది. అయితే, గత నాలుగేళ్లలో, 2014-15 మినహా ఏఐ నష్టాలు తగ్గాయి. 2011-12లో రూ. 5,140 కోట్లుగా ఉన్న నిర్వహణా నష్టం 2012-13 లో రూ. 3,807 కోట్లు; 2013-14లో రూ. 2,123 కోట్లకు తగ్గింది. ఏఐ నెమ్మదిగా రికవరీ దిశగా సాగుతోందని, 2015-16లో కనీసం రూ. 6 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేయవచ్చని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.