: కోచ్ పదవి వార్తలపై గంగూలీ ఆశ్చర్యం... తాను మొదటిసారి వింటున్నానన్న దాదా
టీమిండియా తదుపరి కోచ్ గా పని చేసేందుకు తాను ఆసక్తి చూపుతున్నానంటూ వచ్చిన వార్తలపై మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మీరు కోచ్ రేసులో ఉన్నారా? లేరా? అని అడగ్గా, "ఈ విషయాన్ని నేను తొలిసారి వింటున్నా" అని చెప్పాడు దాదా. అయితే "దానిపై ఏమీ మాట్లాడను. ఊహాగానాలు కట్టిపెట్టండి. ఎలాంటి ప్రచారం చేయొద్దు" అని పేర్కొన్నాడు. కోచ్ పదవిపై చర్చించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియాను కలిశారన్న వార్తలపై గంగూలీ మాట్లాడుతూ, లేదు లేదని చెప్పాడు. 'ఆయన అధ్యక్షుడిగా, నేను బెంగాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ప్రతిరోజు కలుసుకుంటా'మని సమాధానమిచ్చాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్ రేసులో ఉన్నాడన్న వార్తల నేపథ్యంలో... మీ ఇద్దరిలో మంచి కోచ్ ఎవరు కాగలరు? మీరా? లేక ద్రవిడా? అని అడిగితే, గంగూలీ స్పందిస్తూ, "ఇద్దరం మంచి కోచ్ లు కాగలం. రాహుల్ గొప్ప బ్యాట్స్ మెన్" అని అన్నాడు. మరోవైపు దాల్మియా దగ్గర గంగూలీ విషయాన్ని ప్రస్తావిస్తే, "ఇంతవరకు మేమెలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకు ఏమీలేదు. కానీ త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పారు.