: నేను ఇచ్చిన మాట మర్చిపోను...ఎవరైనా చెప్పిన మాటా మర్చిపోను: రాజేంద్రప్రసాద్
ఎన్నికల సందర్భంగా తానిచ్చిన మాటను మర్చిపోవడం అనేది లేదని 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఓ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు ఎవరైనా ఇచ్చిన సలహాను కూడా మర్చిపోనని అన్నారు. ఇకపై తాను 'మా'కు ఏం చేయాలో అంతా చేస్తానని చెప్పాడు. ముందు నిధులు సమీకరిస్తానని, 'మా'కు కార్యాలయం ఏర్పాటు చేస్తానని, అనంతరం పేద సినీ కళాకారులకు ఇన్సూరెన్స్ చేయిస్తానని రాజేంద్రప్రసాద్ భరోసా ఇచ్చాడు. గతంలో ఏం జరిగిందో అదంతా పక్కన పెడితే, 'మా' సౌఖ్యమే అందరికీ కావాల్సిందని, దానిని తాను పూర్తి చేస్తానని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశాడు. కొద్దిరోజులు తనపై అభాండాలు వేసిన వారిని ఏడవనివ్వమని అన్నాడు. మాలో అర్హులందరికీ సభ్యత్వం కల్పిస్తానని, లక్ష రూపాయల సభ్యత్వంపై అందరితో కూర్చుని చర్చిస్తానని రాజేంద్రప్రసాద్ వెల్లడించాడు.