: పోయిన ఫోన్ ను కనిపెట్టే గూగుల్ 'ఫైండ్ మై ఫోన్'
ఎప్పుడోకప్పుడు మనం సెల్ ఫోన్ ను ఎక్కడో ఒకచోట పెట్టి మర్చిపోతుంటాం. కంగారుపడి ఫోన్ గురించి తెగ వెతుకుతాం. ఇకపై అటువంటి ఇబ్బందులు అవసరం లేదు. ఎందుకంటే, కనిపించని స్మార్ట్ ఫోన్ ను వెతికేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్ ను విడుదల చేసింది. మొబైల్ డెస్క్ టాప్ పై ఉండే గూగుల్ సెర్చ్ లో 'ఫైండ్ మై ఫోన్' అని టైప్ చేస్తే అది మన ఫోన్ ఉన్న లొకేషన్ ను తెలుపుతుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మొబైల్ కొనుగోలుదారులు తమ ఫోన్ లో లేటెస్ట్ వెర్షన్ తో ఉన్న గూగుల్ యాప్, స్మార్ట్‌ఫోన్ లొకేషన్ సర్వీస్ ఆప్షన్ పనిచేసే విధంగా చూసుకోవాలి. రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే, ఆండ్రాయిడ్ 'డివైజ్ మేనేజర్' ద్వారా ఫోన్ ఐదు నిమిషాలపాటు రింగ్ అయ్యేలా చేస్తుందని గూగుల్ అధికారులు తెలిపారు. ఒకవేళ ఫోన్ దొంగిలించబడితే, అందులోని విలువైన డేటాను చేరిపివేసే వీలు కూడా ఉందని గూగుల్ తెలిపింది.