: అక్బర్ కన్నా రాణా ప్రతాప్ గొప్ప... విద్యార్థులకు 'మరో చరిత్ర' చెబుతున్న రాజస్థాన్ ప్రభుత్వం!


చరిత్రకు కూడా కాషాయ రంగు అంటింది. చరిత్రనే మారుస్తూ 'మరో చరిత్ర' చెబుతోంది. రాజస్థాన్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మారుస్తోంది. అనాదిగా చక్రవర్తి అక్బర్ కు ఉన్న 'గ్రేట్' హోదాను మహారాణా ప్రతాప్ కు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన రాష్ట్ర విద్యా శాఖా మంత్రి వాసుదేవ్ దేవ్నానీ ఆలోచనలకు అనుగుణంగా, ఆయన ఇచ్చిన సూచనల మేరకు అధికారులు పుస్తకాల్లో పాఠాలను మార్చినట్టు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వచ్చే కొత్త పుస్తకాల్లో 'అక్బర్ కన్నా రాణా ప్రతాప్ గొప్ప' అని పిల్లలు చదువుకోనున్నారు. ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, వాసుదేవ్ మాత్రం దీన్ని సమర్థించుకున్నారు. ఒకే సమయంలో ఇద్దరు 'గ్రేట్'లు ఉండరని అన్నారు. కాగా, ప్రస్తుతం రాజస్థాన్ లో భాగంగా ఉన్న మేవార్ రాజధానిగా పరిపాలన సాగించిన రాణా ప్రతాప్ రాజపుత్ వంశానికి చెందిన వాడు. అక్బర్ తో యుద్ధం కూడా చేశాడు. ప్రతాప్ కు 1572 లో రాజ్యాభిషేకం జరుగగా, అంతకు కొన్ని సంవత్సరాల ముందే అక్బర్ తో సంధి కోసం రాజపుత్ వంశీకుడు భర్మాల్ తన కుమార్తె హర్కా బాయి అలియాస్ జోదాను అక్బర్ కు ఇచ్చి వివాహం చేశాడని, ఆమె తదనంతరం మరియమ్-ఉజ్-జమానీ పేరిట అక్బర్ చక్రవర్తి భార్యగా, జహంగీర్ తల్లిగా నిలిచారని చరిత్ర మనకు చెబుతోంది. మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యం నుంచి మేవార్ ను కాపాడేందుకు రాణా ప్రతాప్ పోరాడినట్టు తెలుసు. 1576, జూన్ 21న రాణా ప్రతాప్ ఓటమి చెందినట్టు చరిత్రలో ఉంది. ఇప్పుడు చరిత్రను వక్రీకరిస్తూ, రాజస్థాన్ పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారని విద్యా నిపుణులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News