: కువైట్ రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం... గుండెపగిలి సంబేపల్లిలో తల్లి మృతి!
నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఒక్క కడప జిల్లా వాసులనే కాక యావత్తు తెలుగు ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. పొట్టకూటి కోసం పరాయి దేశం వలస వెళ్లిన కన్న కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఓ తల్లి గుండె పగిలి మరణించింది. పలువురిని కంటతడిపెట్టించిన ఈ ఘటన వివరాల్లోకెళితే... కడప జిల్లా సంబేపల్లి మాజీ ఎంపీటీసీ నారా ప్రభాకర్ నాయుడు, మనోహరమ్మ దంపతుల కొడుకు దిలీప్ చక్రవర్తి (34) ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. కువైట్ లో ఉద్యోగం సంపాదించుకుని ఉత్సాహంగా కాలం వెళ్లబుచ్చుతున్న అతడు నిన్న అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కొడుకు లేడన్న సమాచారం తెలిసిన అతడి తల్లి మనోహరమ్మ (64) గుండెపోటుకు గురై చనిపోయింది. దీంతో సంబేపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.