: బెజవాడలోనూ ‘ఉగ్ర’ జాడలు... ఎన్ఐఏ అదుపులో నలుగురు సిమీ ఉగ్రవాదులు!
తెలుగు రాష్ట్రాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘ఉగ్ర’ భూతం పరిధి మరింత విస్తరిస్తోంది. నల్గొండ జిల్లా సూర్యాపేట కాల్పుల నేపథ్యంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న సిమీ ఉగ్రవాదుల విస్తరణ బట్టబయలైంది. ఆ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులపై సాగిన పోలీసుల వేటలో ఇద్దరు ఉగ్రవాదులు జానకీపురం ఎన్ కౌంటర్ లో హతం కాగా, మరో టెర్రరిస్టు తప్పించుకున్నాడు. అతడి కోసం వేట సాగించిన తెలంగాణ పోలీసులకు మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఉగ్రవాదుల స్థావరాలు దొరికాయి. ఇక ఘటన జరిగిన నాడే రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నగరంలో ఇటీవల 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ, విచారణ అనంతరం 11 మందిని వదిలేసింది. మరో నలుగురు మాత్రం ఇప్పటికీ ఎన్ఐఏ అదుపులోనే ఉన్నారు. సిమీ ఉగ్రవాద సంస్థతో ఆ నలుగురికి సంబంధాలున్నాయని రూఢీ కావడంతో ఎన్ఐఏ వారిని అదుపులోకి తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన ఎన్ఐఏ, సదరు వ్యక్తులు చెప్పిన సమాచారం ప్రకారం ఇరు రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు చేస్తోంది.