: శేషాచలం ఎన్ కౌంటర్ ఎఫెక్ట్!... ఏపీఎస్ఆర్టీసీకి రూ.1.80 కోట్ల నష్టం!


తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై పెను ప్రభావాన్నే చూపింది. కేవలం వారం వ్యవధిలో రూ.1.80 కోట్ల మేర ఆర్టీసీకి నష్టం వాటిల్లింది. వివరాల్లోకెళితే... ఈ నెల 7న చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలు మృత్యువాతపడ్డారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఏపీ ఎన్ కౌంటర్ పై నిరసనలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులోని ఏపీ సంస్థలపై దాడులు జరిగాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులపైనా తమిళ తంబీలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పరిస్థితి కాస్త కుదుటపడిందని భావించిన అధికారులు, బస్సులు తిప్పాలని యత్నించగా, భద్రత కల్పిస్తేనే కాని తమిళనాడుకు బస్సులు నడపలేమని సిబ్బంది తెగేసి చెప్పారు. ఈ క్రమంలో వారం రోజులకు పైగా తమిళనాడుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీంతో సంస్థకు రూ.1.8 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News