: భటిండా జైల్లో గ్యాంగ్ వార్... ఖైదీల మధ్య కాల్పులు, ఒకరికి తీవ్ర గాయాలు
పంజాబ్ లోని భటిండా జైల్లో నేటి ఉదయం గ్యాంగ్ వార్ జరిగింది. రెండు వర్గాలుగా విడిపోయిన ఖైదీల మధ్య గొడవ నేపథ్యంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కరుడుగట్టిన నేరస్థుడు గుర్జిత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. కాస్త ఆలస్యంగా స్పందించిన జైలు అధికారులు గాయపడ్డ గుర్జిత్ సింగ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్రమ ఆయుధాల సరఫరా కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న కుల్బీర్ సింగ్ నౌరానా కాల్పులకు తెగబడ్డట్లు జైలు అధికారులు అనుమానిస్తున్నారు. జైల్లో నౌరానా ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. ఇటీవల జైల్లోనే సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న ఫోజులో ఉన్న నౌరానా ఫొటోలు ఫేస్ బుక్ లో దర్శనమిచ్చాయి. అయితే ఆ తర్వాత వాటిని జైలు అధికారులు తొలగించారు. తాజాగా జైల్లోనే అతడు కాల్పులకు తెగబడటంతో జైలు అధికారులపై వేటు పడే ప్రమాదం లేకపోలేదు.