: రాయొద్దన్న వార్త రాసినందుకు జర్నలిస్టులపై కేసులు... రంగారెడ్డి జిల్లా పోలీసుల దాష్టీకం!
అది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. దేశవ్యాప్తంగా ఆ మహనీయుడికి ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. అయితే రంగారెడ్డి జిల్లా పోలీసులు మాత్రం నివాళులర్పించే ప్రజలను అడ్డుకున్నారు. దీనిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రజలు నిరసనకు దిగారు. సదరు విషయంపై వార్త రాయొద్దని పోలీసులు జర్నలిస్టులకు హుకుం జారీ చేశారు. అయితే, రాజ్యాంగ నిర్మాత కార్యక్రమంలో చోటుచేసుకున్న ఆందోళనకు సంబంధించిన వార్తను రాసేందుకే జర్నలిస్టులు నిర్ణయించుకున్నారు. వార్త రాసేశారు. దీంతో భగ్గుమన్న పోలీసులు వార్త రాసిన ఇద్దరు జర్నలిస్టులపై ఏకంగా కేసులు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... రంగారెడ్డి జిల్లా శంషాబాదు మండలం నర్కోడలో అక్కడి ప్రజలు ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు వివిధ కారణాలు చెప్పి రెండుసార్లు తొలగించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు శంషాబాదు-షాబాదు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ వార్తను కవర్ చేసేందుకు రెండు తెలుగు దిన పత్రికలకు చెందిన జర్నలిస్టులు వెళ్లారు. వార్త రాయొద్దంటూ పోలీసులు వారిపై ఆంక్షలు విధించారు. అయితే పోలీసుల మాట కాదని సదరు జర్నలిస్టులు వార్త రాసేశారు. నిన్న తెల్లవారేసరికి వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సదరు విలేకరులతో పాటు ‘మరికొంత మంది’ అనే పదాన్ని చేర్చి మరకొందరినీ ఇరికించేందుకూ రంగం సిద్ధం చేశారట.