: కెనడాలో మోదీకి ఘన స్వాగతం.. శతఘ్నులు పేల్చి సెల్యూట్ చేసిన సైన్యం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కెనడా రెడ్ కార్పెట్ పరిచింది. మూడు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ నిన్న జర్మనీలో పర్యటన ముగించుకుని కెనడా వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు 42 ఏళ్ల తర్వాత తమ దేశ గడ్డపై కాలుమోపిన భారత ప్రధానికి కెనడా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శతఘ్నులను పేల్చి స్వాగతం చెప్పిన ఆ దేశ సైన్యం, మోదీకి సెల్యూట్ చేసింది. సాధారణంగా కెనడా వెళ్లే దేశాధినేతలకు తుపాకులు పట్టుకున్న సైన్యం స్వాగతం చెబుతుంది. అయితే సంప్రదాయాన్ని పక్కనబెట్టిన కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, సైన్యం చేత వినూత్న కవాతు చేయించారు. శతఘ్నులను పేల్చి, మోదీకి సెల్యూట్ చేయించారు. ప్రధాని హోదాలో హార్పర్ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.