: పాత ఇనుప సామానుల దుకాణంలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విమానం!
లిక్కర్ కింగ్ గా ఓ వెలుగు వెలిగిన యూబీ బ్రూవరీస్ చైర్మన్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ అధిపతి విజయ్ మాల్యా విమానం పాత ఇనుప సామానుల దుకాణానికి (స్క్రాప్) చేరింది. 11 సీట్లున్న ఈ చిన్న విమానాన్ని విజయ్ మాల్యా తన సొంత అవసరాలకు వినియోగించేవారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కనుమరుగైన నేపథ్యంలో ఆ సంస్థ చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేసుకునేందుకు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మాల్యా చిన్న విమానాన్ని వేలం వేసిందట. ఈ వేలంలో స్క్రాప్ రంగంలోని ఓ సంస్థ దీనిని రూ.22 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ విమానాన్ని తమ దుకాణానికి తరలించిన సందరు స్క్రాప్ సంస్థ యజమాని, దాని పార్టులన్నీ విప్పేసి విడిగా అమ్ముకునేందుకు రంగంలోకి దిగారు. కూలీలతో నాలుగు రోజుల్లో ఈ విమానాన్ని చిన్న చిన్న ముక్కల కింద మార్చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారట.