: సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై.... నేడు ప్రారంభించనున్న కేటీఆర్!


భాగ్యనగరిగా ప్రసిద్ధి చెందిన హైదరాబాదులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. నగరంలోని ప్రముఖ పర్యాటక స్థలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తొలి సర్కారును ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టుపై దాదాపు పది నెలలుగా అవిశ్రాంత కసరత్తు చేశారు. ఎయిర్ టెల్ సహకారంతో తొలుత మాదాపూర్ లో చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో క్వాడ్ జెన్ అనే సంస్థను రంగంలోకి దించిన కేటీఆర్, అతిస్వల్ప వ్యవధిలోనే పనులు పూర్తి చేయించారు. బీఎస్ఎన్ఎల్ తో కలిసి క్వాడ్ జెన్ సంస్థ హుస్సేన్ సాగర్ పరిధిలో ఉచిత వైఫై సేవలను అందించనుంది. నేడు హుస్సేన్ సాగర్ తీరం సమీపంలో ఉన్న మారియట్ హోటల్లో కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించనున్నారు. తొలి వీడియో కాల్ ను ఆయన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు చేయనున్నారట. ఇక సేవల విషయానికొస్తే, హుస్సేన్ సాగర్ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా పీవీ ఘాట్ వరకు 10 కిలో మీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 2,500 మంది ఈ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వినియోగదారుల ఆసక్తిని బట్టి ఈ సామర్థ్యాన్ని పెంచే అవకాశాలున్నాయి. ప్రత్యేక ఐడీ, పాస్ వర్డ్ లు పొందిన వారికే ఈ సేవలు అందనున్నాయి.

  • Loading...

More Telugu News