: ఢిల్లీ బోణీ కొట్టిందోచ్... వీరేంద్రుడిపై యువీదే పైచేయి!


వీరేంద్రుడిపై యువీదే పైచేయిగా నిలిచింది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లోనే కాక, గత సీజన్ లోనూ వరుస పరాజయాలతో సతమతమైన ఆ జట్టు యువీ రాకతో జూలు విదిల్చింది. ఇప్పటిదాకా 11 వరుస పరాజయాలు చవిచూసిన ఆ జట్టు యువరాజ్ సింగ్ రాకతో ఎట్టకేలకు విజయదుందుభి మోగించింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో నిన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విన్నర్ గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఫామ్ లేమితో టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్(47) రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ, ఇంకో బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి గెలుపొందింది. యువరాజ్ సింగ్ (55) తో పాటు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (68) కూడా రాణించడంతో ఢిల్లీ జట్టు కింగ్స్ ఎలెవెన్ పై 5 వికెట్ల తేడాతో సులువుగానే విజయం సాధించింది. వెరసి టీమిండియా జట్టులో మాజీ సభ్యులైన వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లలో యువీదే పైచేయిగా నిలిచింది.

  • Loading...

More Telugu News