: నేతాజీ రహస్య ఫైళ్ల నేపథ్యంలో... అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ను సమీక్షించేందుకు ప్యానెల్ ఏర్పాటు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం లేదా అదృశ్యానికి సంబంధించిన రహస్య ఫైళ్లు బహిర్గతం చేయాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ ప్యానెల్ ఏర్పాటు చేసింది. కాబినెట్ సెక్రెటర్ నేతృత్వంలో ఏర్పాటైన అంతర్గత మంత్రిత్వశాఖ కమిటీ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ను సమీక్షించనుంది. ఈ ప్యానెల్ లో రా (రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్), ఐబీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పీఎంవో అధికారులు ఉంటారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని బెర్లీన్ లో సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు సూర్యా బోస్ రెండు రోజుల కిందట కలుసుకున్నారు. ఈ సమయంలో ఫైళ్ల గురించి ఆయన మేనల్లుడు మోదీ వద్ద ప్రస్తావించగా తప్పకుండా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. నేతాజీకి సంబంధించి మొత్తం 41 రహస్య ఫైళ్లు ఉన్నాయి. అందులో ఐదు ఫైళ్లను ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) రెడ్ విత్ 8 (2) ప్రకారం బహిర్గతం చేయాలని కేరళకు చెందిన శ్రీజిత్ పణికర్ అనే ఐటీ నిపుణుడు సమాచార హక్కు చట్టం కింద పీఎంఓకు ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైళ్లను బహిర్గతపరిచే అధికారం లేదని పీఎంవో స్పష్టం చేసింది.