: డేటింగ్ వద్దని చెప్పినా, నా కుమార్తెలు వినలేదు: సిల్వెస్టర్ స్టాలోన్
ఎవరైనా డేటింగ్ కు రమ్మని పిలిస్తే నిరాకరించాలని, కనీసం 40 ఏళ్లు వచ్చేవరకూ అటువంటి పనులు వద్దని సలహా ఇస్తే, తన కుమార్తెలు వినలేదని ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ అన్నారు. తన సలహాపై నానా రాద్ధాంతం చేశారని ఆయన తెలిపారు. తన కుమార్తెలు సోఫియా (18), సిస్టీన్ (16), స్కార్లెట్ (13) లంతా ఒకేమాటపై నిలిచి గొడవ చేశారని వాపోయాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ, ఓ అబ్బాయి తన పెద్దమ్మాయిని డేటింగ్ కు పిలిచాడని, ఒక తండ్రిగా అందుకు సమ్మతించేందుకు మనసు ఒప్పుకోలేదని చెప్పాడు. తన ఇంటికి వచ్చిన 18 ఏళ్ల యువకుడు, "సోఫియా ఎక్కడ? అని అడగ్గా నేను ఆమె ఈజిప్టులో ఉంది. ఎప్పటికీ అక్కడే ఉంటుంది అని చెప్పాను. ఆ వెంటనే ఇంట్లోని అందరూ నా మీద విరుచుకు పడ్డారు" అని చెప్పాడు. కానీ, అప్పుడు 14 సంవత్సరాల వయసున్న సోఫియా తన మాట వినకపోయేసరికి, చివరికి ఆమె బాయ్ ఫ్రెండ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. కరచాలనం సమయంలో మాత్రం కాస్త గట్టిగానే చేతులు వత్తానని అన్నారు. ఈ విషయమంతా 'ఫిమేల్ ఫస్ట్' అనే మ్యాగజైన్ లో ప్రత్యేక కథనంగా ప్రచురితమైంది.