: కాస్త ఊరట... తగ్గిన ఆహార ఉత్పత్తుల ధరలు
గడచిన మూడు నెలల కాలంలో ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుతూ వచ్చాయని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. మార్చి నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.33 శాతంగా నమోదైంది. అంతకుముందు ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం మైనస్ 2.06 శాతం వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. కాగా, ఆహార ఉత్పత్తుల ధరలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయని గణాంకాల శాఖ వెల్లడించింది. గత కొంతకాలంగా ద్రవ్యోల్బణం తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయని, దీంతో వడ్డీ రేట్లు మరింతగా తగ్గించేందుకు ఆర్ బీఐకి అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, ఫిబ్రవరిలో 7.74 శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో 6.31 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో కూరగాయల సూచీ 15.54 శాతం నుంచి 9.68 శాతానికి దిగివచ్చింది. మాన్యుఫాక్చర్డ్ ప్రోడక్టుల సూచీ ఏకంగా 68 నెలల కనిష్ఠ స్థాయిలో మైనస్ 0.19 శాతం వద్ద కొనసాగింది. ఇంధనం, విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం మాత్రం స్వల్పంగా పెరిగి 3.3 శాతం వద్ద నిలిచింది.