: జగన్ కక్కుర్తి వల్లే నాడు పోలవరం నిర్మాణం ఆగింది: ఏపీ మంత్రి దేవినేని ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కొద్దిసేపటి క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కక్కుర్తి కారణంగానే నాడు పోలవరం నిర్మాణం ఆగిందని ఆయన ఆరోపించారు. జగన్ ధనదాహం కారణంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టిందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించినా, పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లోని పూడికతీతను తీసివేసి, జలాశయాలకు జలకళ తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని కూడా మంత్రి పేర్కొన్నారు.