: రేపు మీడియా ముందుకు యువరాజు... అజ్ఞాతం వీడనున్న రాహుల్ గాంధీ!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో యువరాజుగా పార్టీ కార్యకర్తల నుంచి నీరాజనాలందుకున్న రాహుల్ గాంధీ రేపు మీడియా ముందుకు రానున్నారట. సరిగ్గా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కాస్త ముందుగా, రెండు వారాల పాటు సెలవు తీసుకుని వెళ్లిన రాహుల్ గాంధీ 50 రోజులు దాటినా పత్తా లేకుడా పోయారు. రేపొస్తున్నారు, మాపొస్తున్నారంటూ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు తమకు తాము సమాధానం చెప్పుకుంటూనే దేశ ప్రజలకు అస్పష్ట సమాచారం అందజేశారు. రాహుల్ పర్యటనపై అధికార పార్టీ బీజేపీ అంతెత్తున ఎగిరిపడింది. బడ్జెట్ సమావేశాల సమయంలో సెలవేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక బాధ్యత కలిగిన నేత చేసే పనేనా? ఇది అంటూ దునుమాడింది. అయితే ఎప్పటికప్పుడు రాహుల్ ను వెనకేసుకువచ్చిన కాంగ్రెస్ నేతలకు కూడా ఆయనపై కాస్తంత చికాకు వచ్చేసింది. అయితే రేపు నేరుగా మీడియా ముందుకు రానున్న రాహుల్ గాంధీ, తన సుదీర్ఘ అజ్ఞాతాన్ని వీడనున్నారట.