: సున్నా, సున్నా కలిస్తే వచ్చేది సున్నానే!: లాలూ, నితీష్ లపై అమిత్ షా వ్యాఖ్య
బీహార్ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు ప్రచారం ప్రారంభించారు. మొదటిరోజే ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై తనదైన శైలిలో దాడి చేశారు. ఇక్కడి గాంధీ మైదాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నేను లాలూజీకి చెప్పాలనుకుంటున్నా, జీరో ప్లస్ జీరో ఈజ్ జీరో. మీరు నెలకొల్పిన సంకీర్ణం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఏమీ జరగబోదు" అని షా పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ భూ సంస్కరణలను వ్యతిరేకిస్తున్న నితీష్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, "బీహార్ లో ఎన్ని చక్కెర మిల్లులు నడుస్తున్నాయో నితీష్ కుమార్ ను అడుగుతున్నా, ఎన్ని మాల్స్ మీ ప్రాంతంలో వచ్చాయో ప్రశ్నిస్తున్నా, ఎన్ని రహదారులు మంచి కండిషన్ లో ఉన్నాయో చెప్పండి?" అని అమిత్ షా సూటిగా ప్రశ్నించారు.