: హిందూపురంలో బాలకృష్ణ పర్యటన... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

నటుడు బాలకృష్ణ ఈరోజు తన నియోజకవర్గం హిందూపురంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక్కడి చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ఎంపీ నిమ్మల కిష్టప్పతో కలసి తిరిగారు. ముందుగా చిలమత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తరువాత అక్కడి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. లేపాక్షిలోని శ్రీ దుర్గాపాపనేశ్వర స్వామి ఆలయంలో కూడా సీసీ కెమెరాలు ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి హిందూపురం వెళ్లి రూ.50 లక్షలతో నిర్మించబోయే అంబేద్కర్ భవనానికి బాలయ్య భూమి పూజ చేశారు. అనంతరం రహ్మత్ పురలో తాగునీటి పథకానికి కూడా భూమిపూజ నిర్వహించారు. అయితే ఈ పర్యటనలో లేపాక్షి జాతీయ రహదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రాంతం వైపుగా బాలయ్య వస్తారని తెలిసి అక్కడివారు ముందుగానే అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. కానీ విగ్రహం పక్కనుంచే వెళ్లిన ఆయన ఆగకుండా వెళ్లడంతో దళితులు అక్కడే ధర్నాకు దిగారు. ఇది తెలిసిన హిందూపురం ఎంపీ నిమ్మల లేపాక్షికి మళ్లీ వచ్చి వారికి సర్దిచెప్పి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి వెళ్లారు.