: ధనిక దేశం ఖతార్ లో ఉచితంగా పేదల కడుపు నింపుతున్న భారత రెస్టారెంట్
అరబ్ సామ్రాజ్యంలో భాగమైన ఖతార్ రాజధాని దోహా. ఎటు చూసినా ఖరీదైన భవనాలు, రోడ్లపై విలాసవంతమైన కార్లు తిరుగుతూ నిత్యమూ బిజీగా ఉంటుంది. అక్కడికి సుమారు 16 కి.మీ దూరంలో మట్టి కొట్టుకుపోయిన రోడ్లు, పలు చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వర్క్ షాప్ లు ఉంటాయి. బతుకుదెరువు కోసం భారత్ వంటి విదేశాల నుంచి వచ్చిన వలస కూలీలకు తక్కువ ధరకు నివాస సౌకర్యం దొరికేది కూడా అక్కడే. అక్కడో రెస్టారెంట్ ముందు "మీకు ఆకలిగా ఉంటే... డబ్బు లేకపోయినా సరే, ఉచితంగా తినండి" అన్న బోర్డు కనిపిస్తుంది. కేవలం 16 మంది మాత్రమే కూర్చునే వీలున్న రెస్టారెంట్ ను మూడు వారల క్రితం ఇద్దరు భారతీయ సోదరులు షాదాబ్ ఖాన్, నిషాబ్ ఖాన్ లు 'స్ట్రీట్ 23' పేరిట ప్రారంభించారు. "ఇక్కడి కార్మికులకు ఉచితంగా ఆహారం అవసరం. ఈ ఆలోచన నా తమ్ముడి మనసులో నుంచి వచ్చింది" అని గర్వంగా చెబుతున్నాడు షాదాబ్. ఇక్కడ రుచికరమైన భారతీయ వంటకాలను 24 గంటలూ అందిస్తారట. చాలామంది తమ కడుపు నింపుకోవడానికి బ్రెడ్ తీసుకొని, దాన్ని తిని కడుపు నిండా నీరు తాగి పోతుంటారని, అది చూస్తే బాధ కలుగుతుందని షాదాబ్ తెలిపారు. ఇక్కడికి వచ్చే కూలీలు ఆత్మగౌరవం ఉన్నవారని, ఉచితంగా తినమన్నా రోజుకు ఇద్దరు, ముగ్గురు తప్ప ఎక్కువగా రావడం లేదని వివరించారు. మరికొంత మంది ఫ్రీగా తినలేమని చెప్పి ఎంతో కొంత డబ్బిచ్చి వెళ్తున్నారని చెప్పారు. ఫిష్ కర్రీ 6 రియాల్స్ కు (సుమారు రూ. 100), ఎగ్ రోస్ట్ 3 రియాల్స్ కు (సుమారు రూ. 50)కి, పాలక్ పన్నీర్ 10 రియాల్స్ కు (సుమారు రూ. 160)కి అందిస్తున్నారు. కాగా, ఖతార్ దేశంలో 23 లక్షల మంది ప్రజలుండగా, అందులో 7 లక్షల మంది వరకూ వలస వచ్చిన కూలీలేనని అంచనా. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు వేతనాలు సరిగా ఇవ్వడంలేదని విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. దీంతో ఒత్తిడిలో పడ్డ ప్రభుత్వం కార్మికులకు బ్యాంకుల్లో వేతనాలు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. సరాసరిన ఖతార్ లోని వివిధ పరిశ్రమల్లో పని చేసే వారికి రూ. 12 వేల నుంచి రూ. 16 వేల రూపాయల వరకూ వేతనాలు ఉన్నాయి. 2022 వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలకు వేదిక కానున్న ఖతార్ అప్పటి లోగా సమస్యలన్నీ పరిష్కరించాలని కృతనిశ్చయంతో ఉంది.