: మరో రెండు రోజులు వణుకు తప్పదు!
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వాన భయానికి వణుకుతూ గడపాల్సిందేనని వాతావరణ శాఖ వెల్లడించింది. భూ ఉపరితలానికి 1.5 కి.మీ ఎత్తున ఉన్న ఉపరితల ద్రోణికి తోడు తేమ గాలులు, క్యుములో నింబస్ మేఘాల కలయిక కారణంగా కుండపోత వర్షాల ప్రమాదం పొంచి ఉందని, వడగళ్ళతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, గడిచిన 12 గంటల్లో హైదరాబాదులో 3 సెంటీమీటర్లు, తిరుపతిలో 2 సెంటీమీటర్ల వర్షం పడింది. మిగతా చోట్ల 6 మి.మీ. నుంచి 10 మి.మీ. వర్షపాతం నమోదైంది.