: ఆ రైతులకు జనశతాబ్ది రైలును ఇచ్చేయండి... హిమాచల్ ప్రదేశ్ కోర్టు సంచలన ఆదేశాలు
కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలైతే ఇండియాలో తొలిసారిగా ఒక రైలును కలిగి ఉన్న యజమానులుగా ఇద్దరు రైతులు చరిత్ర సృష్టించనున్నారు. అసలు విషయం ఏంటంటే, ఉనా - అంబా పట్టణాల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం 1998లో వీరిద్దరూ భూములు కోల్పోగా, అప్పటినుంచీ వీరికి పరిహారం అందలేదు. కేసును విచారించిన ఉనా అదనపు జిల్లా జడ్జ్ ముకేష్ భన్సాల్, రైల్వేల తీరును తప్పుబడుతూ, ఈనెల 15 లోగా పరిహారం కట్టకుంటే, ఢిల్లీ - ఉనా జనశతాబ్ది రైలును అటాచ్ చేయాలని ఆదేశించారు. రైతులు మేలా రామ్, మదన్ లాల్ లకు రూ. 35 లక్షల రూపాయలను 15వ తేదీ లోగా చెల్లించాలని, లేకుంటే 16న ఉదయం ఉనా రైల్వే స్టేషన్ లో రైలును ఆపేసి బాధితులు స్వాధీనం చేసుకోవచ్చని తీర్పిచ్చారు. అంతకుముందు 2013లో సైతం 6 వారాల్లోగా పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇవ్వగా ఇండియన్ రైల్వే అధికారులు పట్టించుకోలేదు.