: టీసీఎస్ టెక్కీ దారుణ హత్య
ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థ టీసీఎస్ లో ఉద్యోగిగా పని చేస్తున్న అంకిత్ చౌహాన్ అనే టెక్కీని అతని వాహనంలోనే దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఢిల్లీ సమీపంలోని నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిన్న సాయంత్రం మరో సాఫ్ట్ వేర్ సంస్థ ఆక్సెంచర్ లో పనిచేస్తున్న భార్యను కలసిన అనంతరం అంకిత్ తన టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో స్నేహితుడితో కలసి ఇంటికి బయలుదేరాడు. నోయిడా సెక్టార్ 76 వద్దకు రాగానే హోండా అకార్డ్ కారులో వచ్చిన దుండగులు అటకాయించి మెడ, భుజాలపై తుపాకీతో కాల్చారు. తీవ్రంగా గాయపడ్డ అంకిత్ ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. కిల్లర్లు ఎవరు? అంకిత్ తో వారికున్న వైరం ఏంటి? అనే విషయాలపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, అంకిత్ కు మూడు నెలల క్రితమే వివాహం జరిగినట్టు తెలుస్తోంది.