: యూపీఏ కుదుర్చుకున్న 126 రఫాలే యుద్ధ విమానాల డీల్ రద్దు!
భారత దేశ చరిత్రలో అతిపెద్ద డీల్ గా 2007లో చరిత్ర సృష్టించిన 20 బిలియన్ డాలర్ల (ఇప్పటి లెక్కల్లో సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) రఫాలే ఒప్పందాన్ని రద్దు చేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఇకపై రక్షణ ఒప్పందాలను విదేశీ ప్రభుత్వాలతో డైరెక్ట్ గానే కుదుర్చుకోవాలని భావిస్తున్న మోదీ, ప్రైవేటు సంస్థలతో జరిగిన డీల్స్ పరిశీలించి లాభసాటి కాని వాటిని రద్దు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఎంఎంఆర్ సీఏ (మీడియం మల్టీ - రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) పేరిట బిడ్డింగ్ నిర్వహించగా ఈ భారీ కాంట్రాక్టును రఫాలే దక్కించుకుంది. 18 విమానాలను రఫాలే అందించాలని, ఆపై సాంకేతికతను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అప్పగించి ఇండియాలో విమాన తయారీకి సహకరించాలన్నది ఒప్పందం. కాగా, ఆ డీల్ ను రద్దు చేస్తామని డైరెక్ట్ గా చెప్పకుండా "ఒకే కారు రెండు రోడ్లపై ప్రయాణించలేదు. ఆ రెండో రోడ్డు సమస్యలతో ఉన్న కారణంగా మంచి రోడ్డు పైనే వెళ్తాం" అని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం 36 రఫాలే యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో ఇండియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.