: ఐదేళ్లలో 1000 శాతం లాభాలను పెంచుకున్న ఇండియన్ కంపెనీ
ఒక కంపెనీ సాలీనా 10 నుంచి 12 శాతం లాభాలను పెంచుకుంటూ పొతే, అది మంచి పనితీరును నమోదు చేసినట్టే. ఇక లాభాలు 30 శాతం వరకూ పెరిగితే అద్భుత ప్రతిభ చూపినట్టే. అటువంటిది ఒక భారత కంపెనీ 5 సంవత్సరాల వ్యవధిలో సుమారు 1000 శాతం మేరకు లాభాలను పెంచుకుంది. కృత్రిమ తోళ్ళ ఉత్పత్తులను తయారు చేస్తున్న మయూర్ యూనీకోటర్స్ ఈ ఘనతను సాధించింది. 2009లో రూ. 6 కోట్లు ఉన్న సంస్థ నికర లాభం 2014లో రూ. 56.8 కోట్లకు చేరింది. ఈ ఐదేళ్ళ వ్యవధిలో సంస్థ ఆదాయం రూ. 115 కోట్ల నుంచి రూ. 469.60 కోట్ల రూపాయలకు చేరింది. అంతేకాదు గడచిన సంవత్సర కాలంలో బీఎస్ఈ లో 50 శాతానికి పైగా ఈక్విటీ లాభాలను సాధించిన కంపెనీగానూ నిలిచింది. కాగా, వచ్చే ఐదేళ్లు ఇదే విధమైన పనితీరు చూపుతామని చెప్పబోమని, అయితే, కనీసం 25 నుంచి 30 శాతం వృద్ధిని నమ్మకంగా సాధిస్తామని మయూర్ యూనీకోటర్స్ సీఈఓ సురేష్ కుమార్ పొద్దార్ వ్యాఖ్యానించారు.