: అంతటి వ్యక్తి కుటుంబంపై నిఘానా? అన్ని రహస్యాలనూ బయటపెట్టండి: మోదీతో నేతాజీ మనవడు
నేతాజీ సుభాస్ చంద్రబోస్ కుటుంబంపై నిఘా పెట్టారని వచ్చిన వార్తలపై విచారణ జరిపించాలని, అప్పటి పత్రాలను బయట పెట్టాలని ప్రధాని మోదీని నేతాజీ మనవడు సూర్యకుమార్ బోస్ డిమాండ్ చేశారు. ఆయనకు సంబంధించిన అన్ని రహస్యాలనూ బయటపెట్టాలని కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న మోదీ, అక్కడి భారత అంబాసిడర్ విజయ్ గోఖలే ఇచ్చిన విందుకు హాజరై, సూర్యకుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత దేశమంతా నేతాజీ కుటుంబమేనని, ప్రజలంతా అప్పటి రహస్యాలు, పత్రాలను బయట పెట్టాలని డిమాండ్ చేయాలని సూర్యకుమార్ కోరారు. ప్రస్తుతం సూర్యకుమార్ హాంబర్గ్ ఇండో - జర్మన్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా, నేతాజీ జీవితంలోని చివరి రోజులకు సంబంధించి రహస్యాలు దాగున్నాయని అందరూ భావిస్తున్నారని, అవేంటో ఇప్పటికైనా ప్రజలకు తెలియజెప్పాలని మరో మనవడు చంద్రబోస్ డిమాండ్ చేశారు.