: అలాంటి మొగుడు అక్కర్లేదని ఛీకొట్టిన వధువు
ఇంకొన్ని గంటల్లో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తూ, కలల్లో విహరిస్తున్న వధువు... కాబోయే భర్త తీరు చూసి ఛీ అనుకుంది. అలాంటి మొగుడు తనకొద్దని పెళ్లిని ఆపేసింది. వివరాల్లోకి వెళితే, నిజామాబాద్, ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన మీనాక్షి వివాహం జక్రాన్ పల్లికి చెందిన సాయికుమార్ తో నిశ్చయం అయింది. ముందుగా అనుకున్న ప్రకారం కట్న కానుకలు కూడా ఇచ్చారు. పెళ్ళికి రెండు రోజుల ముందు బండి (బైక్) కావాలని వరుడు డిమాండ్ చేయగా, అది కూడా కొనిచ్చారు. తీరా పెళ్ళికి ముందు రోజు తనకు సరైన స్వాగతం పలకలేదని ఆరోపిస్తూ, అదనంగా మరో రూ. 2 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి పీటలు ఎక్కుతానని మొండికేశాడు. విషయం తెలుసుకున్న వధువు ఈ పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో, వరుడిని అరెస్ట్ చేసి చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.