: సూళ్లురుపేటలో ఆగి ఉన్న ప్యాసెంజర్ రైల్లో మంటలు... పరుగులు పెట్టిన ప్రయాణికులు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై-గూడూరు ప్యాసెంజర్ రైల్లోని మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత ఓ బోగీలో చెలరేగిన మంటలు వేగంగా మరో రెండు బోగీలకు విస్తరించాయి. రైల్వే స్టేషన్ లో రైలు నిలిచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీ నష్టం తప్పింది. అలా కాకుండా పట్టాలపై రైలు పరుగులు పెడుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే, భారీ ప్రాణ నష్టం తప్పేది కాదు. మంటలను చూసి ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.