: ఎర్రచందనం అక్రమ రవాణాలో వైసీపీ నేత...దుంగలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వైనం!
ఎర్రచందనం అక్రమ రవాణాలో రాజకీయ నేతలకు ప్రత్యక్ష పాత్ర ఉందనే వాదనకు మరింత బలం చేకూరింది. ఎర్రచందనం దుంగలను తరలిస్తూ ఓ పార్టీకి చెందిన నేత పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కర్నూలు జిల్లాలో నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళితే... వైకాపాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న మస్తాన్ వలి, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాగలమర్రి మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ)గా ఎన్నికయ్యాడు. అయితే అతడిపై అప్పటికే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులున్నాయి. ఈ క్రమంలో మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మస్తావన్ వలి, నేటి ఉదయం జిల్లాలోని రుద్రవరం పోలీసులకు పట్టుబడ్డాడు. అది కూడా ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా! దాంతో అతడిపై పీడీ యాక్టు కింద పోలీసులు కేసులు నమోదు చేయగా, బెయిల్ పై అతడు దర్జాగా బయటికొచ్చేశాడు.