: చెస్ట్ ఆసుపత్రి తరలింపులో మెలిక... పురాతన భవనమైతే నిర్మాణం ఆపాలన్న హైకోర్టు
హైదరాబాదులోని చెస్ట్ ఆసుపత్రి స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి చిన్న షాక్ తగిలింది. తాజాగా ఈ విషయంలో హైకోర్టు ఓ మెలిక పెట్టింది. ఆసుపత్రి వారసత్వ సంపదకు చెందిన పురాతన భవనమైతే సచివాలయ నిర్మాణం ఆపాల్సిందేనని ఈరోజు జరిగిన విచారణ సమయంలో కోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతమున్న సచివాలయానికి వాస్తుదోషం కారణంగా కచ్చితంగా ఆసుపత్రి తరలించాల్సిందేనంటున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై జూపుడి ప్రభాకర్ అనే న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానిపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో వాస్తుదోషం వల్లే ఆసుపత్రిని తరలిస్తున్నట్టు ఎక్కడా లేదని, కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం సచివాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పిందని కోర్టు తెలిపింది. ఈ సమయంలో చెస్ట్ ఆసుపత్రి పురాతన భవనమని, అది పురావస్తు శాఖ కిందకు వస్తుందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. దాంతో, అసలా చెస్ట్ ఆసుపత్రి పురాతన భవన పరిధిలోకి వస్తుందో లేదో పరిశీలించి నివేదిక సమర్పించాలని పురావస్తు శాఖను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అది పురావస్తు శాఖ భవనం కిందకు వస్తే నిర్మాణం చేపట్టడానికి ఏ మాత్రం వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతర విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.