: బట్టల బ్యాగులో బాంబులట... వరంగల్ పోలీసులను పరుగులు పెట్టించిన ఆటో డ్రైవర్లు!
ఉగ్రవాదుల వరుస దాడులు, పోలీసు ఎన్ కౌంటర్ల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రజలు భయాందోళనల్లో వున్నారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం వరంగల్ నగరంలో బాంబుల కలకలం రేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలోని కీర్తి తోరణం కింద ఓ బ్యాగును వదిలి వెళ్లాడు. ఆ బ్యాగుపై అనుమానం వ్యక్తం చేసిన అక్కడి ఆటోడ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాంబు స్క్వాడ్ ను వెంటబెట్టుకుని హుటాహుటిన అక్కడికి వచ్చారు. బాంబు స్క్వాడ్ తనిఖీల విషయం క్షణాల్లో నగరం నలుమూలలకూ వ్యాపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీరా బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేసిన బాంబు స్క్వాడ్, అందులో బట్టలు తప్ప బాంబులు లేవని తేల్చింది.