: ఎన్ కౌంటర్ కేసు విచారణలో ఉంటే మీడియాకు వివరాలెలా చెబుతారు?... ఏపీ పోలీసులకు హైకోర్టు ప్రశ్న
శేషాచలం ఎదురుకాల్పులపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కాల్పులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఏపీసీఎల్పీ కోర్టుకు ప్రతిని సమర్పించింది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడిని ఈ కేసులో ప్రతివాదిగా న్యాయస్థానం చేర్చింది. కాగా కేసు విచారణలో ఉండగా మీడియాకు ఎలా వివరాలు చెబుతారని పోలీసులను సూటిగా ప్రశ్నించింది. చెబితే కోర్టు ధిక్కారమే అవుతుందని పేర్కొంది. మీడియాకు పోలీసులు వివరాలు ఇవ్వకుండా చూడాలని ఏఏజీని ఆదేశించింది. కేసులో ఫిర్యాదుదారుడికి సాయం అందించాలని న్యాయసేవ ప్రాధికార సంస్థకు సూచించింది. ఎన్ కౌంటర్ పై చంద్రగిరిలో ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఇప్పటివరకు 4వేల కేసులు నమోదయ్యాయని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. తణుకులో సీసీ రహదారులు ప్రారంభించిన సమయంలో ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం కూలీల వలస అరికట్టాలని తమిళనాడుకు చెప్పామన్నారు. అయినా కూలీల అంశంపై తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.