: తన జీవితంలో విలువైన వ్యక్తికి ఘనమైన బహుమతినిచ్చిన గేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-8లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ లో వీరవిహారం చేసిన క్రిస్ గేల్ ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా నిర్మించడం వెనుక కారణం ఉంది. గేల్ వచ్చీ రావడంతోనే సుడిగాలిలా చెలరేగుతాడు. అందుకు భిన్నంగా, ఆచితూచి ఆడాడు. ఒక ఎండ్ లో డివిలియర్స్ చెలరేగుతున్నా గేల్ సంయమనం కోల్పోలేదు. ఎందుకంటే, ఓ భారీ ఇన్నింగ్స్ ఆడి, దానిని తన జీవితంలో విలువైన వ్యక్తికి ఘనమైన కానుకగా అందివ్వాలని భావించాడు. అందుకే అవుటైనప్పుడు పెద్దగా పట్టించుకోని గేల్, నిన్న అవుటైన సందర్భంలో కాస్త అసహనానికి గురయ్యాడు. దీనంతటికీ కారణం నిన్న అతని తల్లి పుట్టిన రోజు. పుట్టిన రోజునాడు మంచి ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ చేసి దానిని తల్లికి అంకితమివ్వాలని గేల్ భావించాడు. దురదృష్టవశాత్తు సెంచరీ చేరువలో అవుటయ్యాడు. అయినప్పటికీ టీమ్ ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతి తీసుకునేటప్పుడు గేల్ మాట్లాడుతూ, 'అమ్మా, ఇది నీకు అంకితం, ఈ ఇన్నింగ్స్ నీ కోసం ఆడినదే' అని పేర్కొన్నాడు.