: విద్యార్థులను దోచుకొని కారు ఎత్తుకెళ్ళిన దుండగులు
న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును అటకాయించిన దుండగులు వారిని దోచుకోవడంతో పాటు కారును ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని డెహ్రాడూన్-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాకు చెందిన న్యాయశాస్త్రం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు డెహ్రాడూన్ కు వస్తూ, మార్గమధ్యంలో సిసోనా అనే గ్రామంలోని ఓ ధాబా వద్ద కారును ఆపి విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి బయలుదేరే సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలను ధరించి వచ్చి వారిని అటకాయించారు. కారు నుంచి వారిని బలవంతంగా కిందికి దించారు. విద్యార్థులను బెదిరించిన దుండగులు వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు దోచుకొని, కారును కూడా తీసుకెళ్ళారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.