: గల్లా జయదేవ్ కాదు, నేనే పోటీ చేస్తున్నా: సీఎం రమేష్
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో గందరగోళం ఏర్పడింది. కొన్ని రోజుల కిందట ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ గల్లా జయదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వార్తలొచ్చాయి. అయితే తరువాత రెండు రోజులకే అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎంపీ సీఎం రమేష్ నామినేషన్ వేశారు. తాజాగా దానిపై రమేష్ వివరణ ఇచ్చారు. అసోసియేషన్ కు ఈ నెల 4న జరిగిన ఎన్నికలు చెల్లవని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 19న మళ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు మరో ఎంపీ గల్లాకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు రమేష్ స్పష్టం చేశారు.