: పబ్లిసిటీ అనేది నాకు కొత్తకాదు: రోజా
చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టాడు, రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాడు, ఇప్పుడు కులాల మధ్య కూడా చిచ్చుపెడుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మాట్లాడుతూ, టీడీపీ నేతలు తనను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తనను ఎన్నుకున్నారని, కులాలకు, వ్యక్తిగత విమర్శలకు తాను వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. టీడీపీ తీరు ఎంత దారుణమంటే, కోట్లు కూడబెట్టుకుంటున్న ఎర్రచందనం స్మగ్లర్లను వదిలేసి, పొట్టకూటికి వచ్చిన కూలీలను కాల్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే, పోలీసులకు తుపాకులు వుండేది ఎందుకని అడుగుతున్నారని, పోలీసులకు తుపాకులు ఇచ్చేది కాల్చి చంపడానికేనా? అని ఆమె ప్రశ్నించారు. అలా కాల్చుకుంటూ పోతే ముందుగా టీడీపీ నేతల చుట్టూ ఉన్న వారిలో పీడీ చట్టం కింద కేసులు ఉన్న వాళ్లందర్నీ కాల్చేయాల్సి ఉంటుందని, అలా చేయమని టీడీపీ నేతలు చెప్పగలరా? అని ఆమె నిలదీశారు. తనకు కొత్తగా పబ్లిసిటీ అవసరం లేదని, సినీ నటిగా తనకు పబ్లిసిటీ ఉందని, పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్కులకు పాల్పడడం టీడీపీ వాళ్లకే చెల్లుతుందని ఆమె తిప్పికొట్టారు.