: ఐఎస్ఐఎస్ విడుదల చేసిన తాజా వీడియో మరింత ప్రమాదకరం
ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ తాజాగా విడుదల చేసిన 5 నిమిషాల నిడివిగల వీడియోను అత్యంత ప్రమాదకరమైన వీడియోగా పలువురు పేర్కొంటున్నారు. తమ ఆదేశాలు పట్టించుకోని వ్యక్తులను వరుసగా నిలబెట్టి పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, తమ సంస్థలోకి మహిళల్ని పెద్దఎత్తున చేర్చుకుంటున్నారు. సిరియాలో మహిళలకు ఏకే 47 తుపాకులనిచ్చి, శిక్షణనిస్తున్నారు. వారి శిక్షణకు సంబంధించిన 5 నిమిషాల వీడియోను ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. ఇందులో అల్లాహ్ అక్బర్ అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు దర్శనమిచ్చారు. మాతృభూమికోసం పోరాడుతాం, అందుకోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ వారు ప్రతినబూనుతున్నారు. తుపాకీతో కాల్చే కళలో శిక్షణ పొందుతున్నామని, షరియా చట్టాలు, మత సంబంధ విషయాలపై పట్టుసాధిస్తున్నామని వీడియోలో మహిళలు తెలిపారు. అయితే దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచదేశాల్లోని ముస్లిం మహిళలకు బురఖాలు వేసుకునే అలవాటు ఉంది. దాంతో వారు తుపాకులు పట్టుకుని వస్తే, వారిని కనిపెట్టడం కష్టమని, వారు సమాజానికి మరింత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తమవుతోంది.