: 11 వేల మంది బాలికలు పాఠశాల దశలోనే తల్లులయ్యారట!
2011 జనాభా లెక్కల ప్రకారం 11 వేల మంది బాలికలు పాఠశాలకు వెళ్లే దశలొనే తల్లులయ్యారనే అంశం ఒడిశాలో కలకలం రేపుతోంది. తల్లులవుతున్న వారిలో ఎక్కువ మంది 15 ఏళ్ల లోపు బాలికలే కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తం 59.09 లక్షల మంది బాలికల్లో 15 ఏళ్లలోపు ఉన్న 41,729 మంది బాలికలకు ఇప్పటికే వివాహాలు జరిగాయని లెక్కలు వెల్లడించాయి. ఈ సంఖ్యలో నాలుగో వంతు మంది అంటే 10,685 మంది అమ్మాయిలు 15వ పుట్టిన రోజు జరుపుకోకముందే గర్భం దాల్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కారణాలు అన్వేషిస్తే, గిరిజనుల్లో ఇంకా బాల్యవివాహాలు అమల్లో ఉండడం ఒక కారణం కాగా, బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారు)కు చెందిన వారిలోనే ఈ జాఢ్యం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబంలో పెద్దల ఆలోచనా సరళి కూడా ఈ దారుణానికి మరో కారణమని గణాంకాలు తెలిపాయి. తొందరగా పెళ్లి చేసేస్తే బాలికకు సామాజిక భద్రత వస్తుందని కుటుంబ పెద్దలు కూడా ఆలోచించడం కూడా ఈ దారుణానికి ఓ కారణమని గణాంకాలు తెలిపాయి.